ఇంకా తేలని రుణాల లెక్క! | - | Sakshi
Sakshi News home page

ఇంకా తేలని రుణాల లెక్క!

Oct 16 2025 8:17 AM | Updated on Oct 16 2025 8:17 AM

ఇంకా

ఇంకా తేలని రుణాల లెక్క!

డ్వాక్రా సంఘాల నిధుల గోల్‌మాల్‌

కొనసాగుతున్న అధికారుల విచారణ

తాజాగా ఏపీఎం, సీసీపై సస్పెన్షన్‌ వేటు

యాచారం: డ్వాక్రా సంఘాల నిధుల గోల్‌మాల్‌ విషయంలో అప్పటి ఐకేపీ ఏపీఎం సుదర్శన్‌రెడ్డి, చౌదర్‌పల్లి సీసీ జంగయ్యపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ డీఆర్‌డీఓ శ్రీలత ఉత్తర్వులు జారీ చేశారు. చౌదర్‌పల్లి వీకేబీ (విలేజ్‌ బుక్‌ కీపర్‌) వరలక్ష్మి పర్యవేక్షణలో 25 గ్రామ స్వయం సహాయక సంఘాల్లో రూ.లక్షలాది నిధుల పక్కదారి పట్టాయంటూ రెండు నెలల క్రితం మహిళలు ఆందోళనకు దిగారు. రుణాలు తీసుకోనప్పటికీ యాచారం ఎస్‌బీఐ ఖాతాల్లో అప్పులను గుర్తించిన మహిళలు సాగర్‌రోడ్డుపై ఉన్న బ్యాంకు ఎదుట బైఠాయించి ఆందోళనకు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, డీఆర్‌డీఓ శ్రీలతకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు నిధుల గోల్‌మాల్‌ జరిగిందని నిర్ధారించారు. 25 స్వయం సహాయక సంఘాల్లో రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల అప్పులున్నట్లు రికార్డుల్లో నమోదైంది.

రికార్డుల్లో లేని రూ.3 కోట్ల రుణాలు

చౌదర్‌పల్లిలో 40కి పైగా స్వయం సహాయం సంఘాలకు యాచారం ఎస్‌బీఐ నుంచి రూ.7 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. నిధుల స్వాహా వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టగా మొత్తం రూ.7 కోట్లకు గాను రూ.4 కోట్ల రుణాలకు సంబంధించి మాత్రమే రికార్డులున్నట్లు గుర్తించారు. రూ.3 కోట్లకు లెక్కలు లేకపోవడంతో డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు బ్యాంకు సిబ్బంది పాత్రపై ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

ఉన్నతాధికారులకు కలెక్టర్‌ లేఖ

చౌదర్‌పల్లి, మల్కీజ్‌గూడ స్వయం సహాయక సంఘాల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి అప్పటి ఎస్‌బీఐ మేనేజర్‌ ఝాన్సీరాణి పాత్రే కీలకమని, ఆమెను విధుల నుంచి తొలగించి విచారణ చేపట్టాలని.. నిధులను రికవరీ చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఎస్‌బీఐ మేనేజర్‌ మల్కీజ్‌గూడ, చౌదర్‌పల్లి గ్రామాల్లోని వీబీకేల ద్వారా బ్యాంకు నుంచి సంఘాల్లో లేని మహిళల పేర్ల మీద రూ.లక్షలాది నిధులను బదిలీ చేశారు. తర్వాత వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. వారం రోజులుగా మల్కీజ్‌గూడ, చౌదర్‌పల్లి గ్రామాల్లో యాచారం ఎస్‌బీఐ, ఐకేపీ అధికారుల బృందం కలిసి మహిళలతో సమావేశమై విచారణ చేపడుతున్నారు. తాజాగా రెండు గ్రామాల్లో రూ.10 నుంచి రూ.20 లక్షల్లోపు రికవరీ చేసినట్లు తెలుస్తోంది.

విచారణ కొనసాగుతోంది

అప్పటి యాచారం ఎస్‌బీ ఐ మేనేజర్‌ సహకారంతోనే రూ.లక్షలాది నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. చౌదర్‌పల్లి, మల్కీజ్‌గూడ స్వయం సహాయక సంఘాల్లో బ్యాంకు మేనేజర్‌ చేతివాటం ఉంది. ఆమెను విధుల నుంచి తొలగించి నిధులు రికవరీ చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షించని ఏపీఎం సుదర్శన్‌రెడ్డి, సీసీ జంగయ్యను సస్పెండ్‌ చేశాం. విచారణ కొనసాగుతోంది.

– శ్రీలత, డీఆర్‌డీఓ

ఇంకా తేలని రుణాల లెక్క! 1
1/1

ఇంకా తేలని రుణాల లెక్క!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement