
మట్టి తవ్వకాలు ఆపేయండి
● పురుగు మందు డబ్బాలతో
దళిత రైతుల ఆందోళన
● కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
తాండూరు రూరల్: తమ భూముల్లో చేపట్టిన మట్టి తవ్వకాలను వెంటనే నిలిపేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. లేదంటే పురుగు మందు తాగి ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని అసైన్డ్ భూమి నుంచి తాండూరు– చించోళి జాతీయ రహదారి పనులకు సంబంధిత కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన దళిత రైతులు స్వామిదాస్, బాలమ్మ, తుల్జమ్మ, బాలప్ప, మొగులప్ప, సామేల్‌లు తదితరులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని లేదంటే పురుగుల మందు తాగి చస్తామని కాంట్రాక్టర్‌కు హెచ్చరించారు. అనంతరం సదరు కాంట్రాక్టర్‌పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మట్టి తవ్వకాల పంచాయితీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడం గమనార్హం. ఈ విషయమై తహసీల్దార్ తారాసింగ్‌ను వివరణ అడగగా.. మట్టి తవ్వకాల కోసం తామెవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మైనింగ్ ఏడీ సత్యనారాయణకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.

మట్టి తవ్వకాలు ఆపేయండి