
అడవి జంతువుల దాడిలో దూడ మృతి
కుల్కచర్ల: గుర్తు తెలియని అడవి జంతువు దాడిలో దూడ మృతిచెందిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ మొయినొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్‌పూర్‌కు చెందిన రైతు చిలుముల బాలకృష్ణయ్య ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన పశువులను పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయాన్నే వెళ్లి చూడగా దూడ రక్తపు మడుగులో పడి ఉంది. సమీపంలోని పొలంలో అడవిజంతువుల పాద ముద్రలు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. పశువులను అటవీ ప్రాంతంలో ఉంచొద్దని రైతులకు సూచించారు.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్
బంట్వారం: విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్‌యాదవ్ కోరారు. బుధవారం ఆయన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి (డీబీసీడబ్ల్యూఓ) మాధవ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2024 వరకు 50 శాతం పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసిందని.. పూర్తిగా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌యాదవ్, ఏబీసీడబ్ల్యూఓ భీంరావు పాల్గొన్నారు.
75 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
కుల్కచర్ల: సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడిన ఘటన మండల పరిధిలోని రాంరెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని ఓ ఇంట్లో 150 బస్తాల (75 క్వింటాళ్లు) సన్నబియ్యం నిల్వలున్నట్లు సివిల్ సప్లై అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వారు దాడిచేసి 75 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
డీసీసీ అవకాశం కల్పించండి
బంట్వారం: నాలుగు దశాబ్దాలుగా హస్తం పార్టీలో సేవలందిస్తూ వివిధ హోదాల్లో పని చేశానని, డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని బ్లాక్– 2 కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి ఏఐసీసీ అబ్జర్వర్ ఠాకూర్‌ను కలిసి దరఖాస్తు అందజేశారు.
‘ఫ్యూచర్’కు భూములిచ్చి సహకరించండి
కందుకూరు: ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చి సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 9లోని 400 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని ఫ్యూచర్‌సిటీలో భాగంగా సేకరించడానికి బుధవారం టీజీఐఐసీ అధికారులతో కలిసి మండల పరిషత్ సమావేశ హాల్‌లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎకరాకు చట్ట ప్రకారం కాకుండా అదనంగా రూ.55 లక్షల చొప్పున చెల్లిస్తామని, భూములు ఇవ్వాలని అన్నారు. దీంతో పాటు భూమిలో చెట్లు, నిర్మాణాలు, బోర్లు ఉంటే అదనంగా అందుతుందన్నారు. రైతులు మాత్రం తమకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ శేఖర్, ఆర్‌ఐ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

అడవి జంతువుల దాడిలో దూడ మృతి

అడవి జంతువుల దాడిలో దూడ మృతి