
ఇందిరమ్మ ఇసుక పక్కదారి!
అనుమతుల పేరిట
ప్రైవేటు వ్యక్తులకు విక్రయం
బషీరాబాద్: ఇందిరమ్మ లబ్ధిదారుల పేరున తీసుకెళుతున్న ఇసుకను ట్రాక్టర్ యజమానులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో ఇతర వ్యక్తులు, ప్రైవేటు నిర్మాణాలకు రూ.4 వేలకు ట్రిప్పు చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీని పర్యవేక్షణ చేయాల్సిన ఒకరిద్దరు కింది స్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి అధికార పార్టీ నాయకుడి అండతో నాలుగు ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేశాడు. పట్టపగలు అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెచ్చిపోతున్న అక్రమార్కులు
మండలంలోని వాగులు, వంకల మీద పడుతున్న అక్రమార్కులు రాత్రింబవళ్లు ఇసుక తోడి రవాణా చేస్తున్నారు. గృహనిర్మాణ లబ్ధిదారుల పేరు చెప్పి యథేచ్ఛగా బయట అమ్మేస్తున్నారు. మండలంలో ఏ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకై నా, ఇందిరమ్మ ఇళ్లకై నా నావంద్గీ కాగ్నానది రీచ్ నుంచి ఇసుక అనుమతులు ఇవ్వాలి. అయితే ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.600 చొప్పున బ్యాంకులో డీడీ తీసి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే అనుమతులు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఫ్రీగా పర్మిషన్ ఇస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుంటున్న అక్రమార్కులు వాగులు, వంకల్లో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. మైల్వార్, ఎక్మాయి, దామర్‌చెడ్, కొత్లాపూర్ గ్రామాలకు చెందిన ఇసుక వ్యాపారులకు ఇందిరమ్మ ఇళ్లు వరంగా మారాయి. లబ్ధిదారుల ప్రొిసీడింగ్ కాపీలను తీసుకువచ్చి అనుమతులు తీసుకుంటున్నారు. వాస్తవానికి లబ్ధిదారులకు ఎంత ఇసుక అవసరమకో హౌసింగ్ ఏఈ ద్వారా లెటర్ తీసుకుని తహసీల్దార్‌కు ఇవ్వాలి. ఆతర్వాతే ఇసుక పర్మిట్లు పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఇవేవీ జరగడం లేదు.
సర్కారు ఆదాయానికి గండి
జేబులు నింపుకొంటున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ,
పోలీసు అధికారులు
సీజ్ చేస్తాం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోకూడదనే అనుమతులు ఇస్తున్నాం. పక్కదా రి పట్టించే ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. ఎక్మాయి వాగులో ఇసుక రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లేసరికే అక్రమార్కులు పారిపోయారు. ఇందులో సిబ్బంది ప్రమేయం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– షాహిదాబేగం, తహసీల్దార్

ఇందిరమ్మ ఇసుక పక్కదారి!