
ఆర్టీసీకి ఏఐ దన్ను
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు ట్రిప్పులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. అధునాతన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రూట్‌లలో ప్రయాణికుల సంఖ్య, రాకపోకలు, ప్రయాణ వేళలు తదితర అంశాలపై శాసీ్త్రయమైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేసేందుకు సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోనుంది.
– సాక్షి, సిటీబ్యూరో
మహా నగర పరిధి అనూహ్యంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా కొత్త కాలనీలు ఏర్పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా బయలుదేరుతున్నారు. ఏయే ప్రాంతాల మధ్య రాకపోకలు విరివిగా కొనసాగుతున్నాయనే అంశంపై స్పష్టత ఉండడం లేదు. జీడిమెట్ల, దుండిగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన వందల కొద్దీ కాలనీల నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, నార్సింగి, తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ.. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. పైగా ఏ కాలనీ నుంచి, ఏయే సమయాల్లో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారనే అంశాలపై కూడా తగిన సమాచారం ఉండదు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రియల్ టైమ్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేసి బస్సులను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన.
ప్రతి రూటూ వాస్తవ చిత్రీకరణ..
● ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో సుమారు 1050 రూట్‌లు ఉన్నాయి. గత ఐదారేళ్లుగా విస్తరించిన నగర శివార్లను పరిగణనలోకి తీసుకొంటే ఈ రూట్‌ల సంఖ్య 1500 దాటి ఉంటుంది. కొన్ని రూట్‌లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంతం వేళల్లో మాత్రమే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. మిగతా వేళల్లో పెద్దగా డిమాండ్ ఉండదు. అలాంటి రూట్‌లపై సరైన వివరాలు లేకుండా బస్సులను నడపడంతో నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ప్రయాణికుల ఆదరణ లేని మార్గాల్లో ట్రిప్పులను తగ్గించి, డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో పెంచేందుకు ప్రతి రూట్‌ను సమగంగా అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించనున్నారు. ఇందుకోసం ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణుల సహాయంతో డిపోల వారీగా వివిధ రూట్‌ల వివరాలను సేకరించనున్నారు.
● గ్రేటర్‌లో ప్రస్తుతం 25 డిపోల్లో ప్రస్తుతం 3,150 బస్సులు ఉన్నాయి. వీటిలో 10 శాతం బస్సులను స్పేర్‌లోనే ఉంచుతారు. దీంతో సుమారు 2,950 బస్సులు ప్రతిరోజు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రతి రోజు 31వేలకు పైగా ట్రి ప్పులు తిరుగుతున్నాయి. ప్రతి ట్రిప్పు నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదు. ఆదాయం కంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అన్ని ట్రిప్పులను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు.
ఆక్యుపెన్సీ ఉన్నా ఆదాయం అంతంతే...
మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సుమారు 18 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో పయనిస్తున్నారు. వీరి చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతిరోజు ఆర్టీసీకి నగదు రూపంలో ఆదాయం లభించేది పురుషుల నుంచే. ప్రతి రోజు 8 లక్షల మంది మగవారు ప్రయాణం చేస్తున్నారు. రోజుకు రూ.6.5 కోట్ల ఆదాయం లభిస్తే అందులో రూ.4 కోట్ల వరకు రియంబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీ ఖాతాలో జమ అవుతోంది. మిగతా 2.5 కోట్లు మాత్రమే నగదు రూపంలో అందుతోంది. ఈ ఆదాయం కంటే నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు, తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏ రూట్‌లో ఎంతమంది ప్రయాణికులు
రద్దీ, డిమాండ్ మేరకు బస్సుల నిర్వహణ
అధునాతన సాంకేతికత వినియోగం
రూట్‌లపై శాసీ్త్రయ అధ్యయనం
ప్రయాణికుల సంఖ్య పెంపునకు ప్రణాళికలు

ఆర్టీసీకి ఏఐ దన్ను