
పర్యావరణ రక్షణకు కృషి చేయాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి బ్రెజిల్ దేశంలో నవంబర్ 10వ తేదీ నుంచి 21 వరకు నిర్వహించనున్న కాప్–30 కార్యక్రమానికి సమాంతరంగా కొనసాగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్స్ పేరుతో నిర్వహించనున్న సదస్సుకు ముందస్తుగా ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజీఆర్ చైర్‌పర్సన్ లీలాలక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కాప్ కార్యక్రమం మొదటగా 1995 మార్చి 28 నుంచి ఏప్రిల్ 7వరకు జర్మనీలో నిర్వహించారని చెప్పారు. ప్రపంచంలో ఒక శాతం జనాభా ఉన్నవారి స్వార్థం కోసం చేస్తున్న ప్రకృతి విధ్వంసంతో 99 శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు జీవవైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించాలని, సహజ ఆవాసాలను పరిరక్షించడం, స్థిరమైన భూ వినియోగాన్ని ప్రోత్సహించడం తదితర చర్యలు చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ నిర్విరామంగా ఐదేళ్లుగా కాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారిణి రాజేశ్వరి, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి, ఐఆర్‌ఎస్ అధికారి బండ్లమూడి సింగయ్య, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్‌రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి