
ద్విచక్ర వాహనం చోరీ
రాజేంద్రనగర్: ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ నిమిషాల వ్యవధిలో దొంగలించి పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... బుద్వేల్ హనుమాన్ దేవాలయం ప్రాంతంలో మసూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ప్రైవేటు ఉద్యోగం నిర్వహించే మసూద్ ఈ నెల 8వ తేదీన రాత్రి విధులు నిర్వహించుకొని తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేసి లోనికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన 15 నిమిషాల అనంతరం బయటికి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని కేవలం నిమిషాల వ్యవధిలోనే తీసుకొని ఉడాయించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రోడ్డు పాడు చేశారంటూ కారు డ్రైవర్‌పై ఫిర్యాదు
మణికొండ: భారీ వర్షాలతో గుంతల మయంగా మారిన రోడ్డు పనులను ఓ వైపు చేస్తుండగానే ఓ కారు దానిపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. దాంతో ఇంజనీరింగ్ అఽధికారులు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కారును పోలీసులకు అప్పగించారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా నుంచి మర్రిచెట్టు వైపు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారటంతో రెండు రోజులుగా కొత్త రోడ్డు పనులను చేపడుతున్నారు. ఆ విషయం గమనించకుండా ఆదివారం ఉదయం ఓ కారు వేస్తున్న రోడ్డుపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. విషయం తెలుసుకుని మణికొండ మున్సిపల్ డీఈ శివసాయి సదరు కారు యజమానిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసి కారును వారికి అప్పగించినట్టు తెలిపారు. ప్రజలందరికీ అవసరమయ్యే పనులను చేపడుతున్నపుడు వారు సహకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పది రోజుల పాటు సదరు రోడ్డును మూసి ఉంచుతున్నామని, ప్రయాణికులు ఇతర రోడ్ల ద్వారా వెళ్లాలని ఆయన కోరారు.
శంషాబాద్: విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో విమానం తిరిగి వచ్చి ఆలస్యంగా బయలుదేరిన సంఘటన ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం 6ఈ–6223 విమానంలో 166 మంది ప్రయాణికులతో సాయంత్రం 3.55 గంటలకు బిహార్ రాజధాని పాట్నాకు టేకాఫ్ తీసుకుని బయలుదేరింది. కొద్ది నిమిషాల అనంతరం 11ఈ సీటులో కూర్చున్న ప్రయాణికుడు సంతోష్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు వాంతులు చేసుకోవడంతో వెంటనే పైలట్ అధికారుల అనుమతితో ఎయిర్‌పోర్టులో 4.15 గంటలకు తిరిగి ల్యాండ్ చేశారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి ఆస్పత్రికి తరలించారు. తిరిగి విమానం సాయంత్రం 5.56 గంటలకు 165 మంది ప్రయాణికులతో పాట్నా బయలుదేరింది.
కూతురిలా ఉన్నావంటూనే..
● అసభ్యకరంగా ప్రవర్తించిన పై అధికారి
● పోలీసులకు ఫిర్యాదు చేసినయువతి, కేసు నమోదు
బంజారాహిల్స్: కూతురిలా ఉన్నావని ప్రారంభంలో మర్యాదగా మాట్లాడి.. చనువు పెంచుకుని మెల్లమెల్లగా తన దుర్బుద్ధిని బయటపెట్టిన సీనియర్ అధికారిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైండ్‌స్పేస్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న యువతి (26)కి తన పైఅధికారిగా పనిచేస్తున్న మృణాల్‌దాస్ (51)తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. తన కుమార్తెలా ఉన్నావంటూ మృణాల్‌దాస్ ఆత్మీయతంగా వ్యవహరించేవాడని యువతి పేర్కొంది. జులై 5న ఆమె.. మృణాల్‌దాస్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–72లో ఉన్న ది స్విఫ్ట్ ఎలిమెంట్ స్పాకు వెళ్లినట్లు తెలిపింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు ఉన్నాయని చెప్పడంతో తాను వెళ్లగా తనకు మసాజ్ చేస్తున్న సమయంలో నిద్రలో ఉండగా ఒక దశలో వెనుక నుంచి వేరొకరి చేతులు తగిలాయని, గమనించి చూసేసరికి మృణాల్‌దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించానంది. తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తాను అరిచి మందలించానని తెలిపింది. ఆయన గది నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ రావాలని ప్రయత్నించాడని ఆరోపించింది. ఇటీవల ఆయన లండన్‌కు వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కూడా వీడియో కాల్ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటనను తాను పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌ఆర్ టీమ్‌కు కూడా తెలియజేశానని పేర్కొంది. తన భద్రత పట్ల భయంగా ఉందని, ఆయన మళ్లీ వేధించే అవకాశం ఉందంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జూబ్లీహిల్స్ పోలీసులు మృణాల్‌దాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.