
తెల్లబంగారం మెరిసేనా!
● మద్దతు ధర దక్కేనా
● వారం రోజుల్లో చేతికి రానున్న పంట
● వర్షాలతో దిగుబడిపై ప్రభావం
● పెరిగిన పెట్టుబడులు
దౌల్తాబాద్: మరో వారం పది రోజుల్లో పత్తి పంట చేతికి రానుంది. రెండు మూడేళ్లుగా దిగుబడి ఉన్నప్పటికీ.. సరైన మద్దతు ధర లేదు. ఈ సారి తెల్ల బంగారం బాగా పండినప్పటికీ.. అధిక వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. పెట్టుబడులు పెరిగాయి. అయితే ఈ లోటు పూడ్చుకోవడానికి మద్దతు దక్కితే ఊరట లభించనుందని రైతులు పేర్కొంటున్నారు.
పెరిగిన ఖర్చులు
మండలంలో ఈ ఏడు 8,900 ఎకరాల్లో పత్తి సాగు అయింది. గతం కంటే పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అయింది. అయితే నిన్నమొన్నటి వానల కారణంగా పొలాల్లో నీరు నిలిచి, మొక్కలకు తెగుళ్లు సోకాయి. వాటి నివారణకు మందులు పిచికారీ చేసేందుకు అధిక వ్యయం వెచ్చించాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 6 నుంచి 8 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక వర్షాలతో నష్టపోయామని, ధర పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
అదే పదివేలు..
గడిచిన రెండేళ్లుగా పత్తి ధర నిలకడగా లేదని, క్వింటాకు రూ.10 వేలు పలికేదని రైతన్నలు తెలిపారు. ఆ తర్వాత రూ.8 వేలకు పడిపోయిందన్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో చాలా మంది పత్తిని నిల్వ చేసుకుని నష్టపోయారని, ఈ సారి పెరిగిన పెట్టుబడులకు రూ. అదే పదివేలు ఉంటే తప్ప మేలు జరగదంటున్నారు.
ధర పెంచితే మేలు
రెండు సంవత్సరాలుగా పత్తికి మద్దతు ధర లేదు. పెట్టుబడులు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. కనీసం ధర పెంచితే మేలు జరుగుతుంది.
–నర్సింహులు, రైతు, దౌల్తాబాద్

తెల్లబంగారం మెరిసేనా!