
అవే వెతలు!
యూరియా కోసం తప్పని తిప్పలు
ఎల్మకన్నె సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరిన రైతులు
ఒక్క బస్తా మాత్రమే అందజేత
తాండూరు రూరల్: అన్నదాతలకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఓ వైపు పొలాల్లో పని చేసుకుంటూ.. మరోవైపు యూరియా కోసం కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఎరువుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె సొసైటీ కార్యాలయం వద్దకు ఆయా గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కార్యాలయానికి చేరుకొని రైతులను సముదాయించారు. క్యూలో ఉన్న వారికి సొసైటీ సీఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది టోకెన్లు పంపిణీ చేశారు. 450 బస్తాల యూరియా రావడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా సరఫరా చేశారు. మధ్యాహ్నం వరకు క్యూలో ఉన్న రైతులకు సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
పెద్దేముల్‌లో..
పెద్దేముల్ ఎఫ్‌ఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు క్యూలో చెప్పులు ఉంచారు. తెల్లవారుజామున 4 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు రైతులతో మాట్లాడి పరిస్థితిని వివరించి క్యూలో నిలబెట్టారు. కార్యాలయ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు తీసుకొని టోకెన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత యూరియా సరఫరా చేశారు. పంటలకు సరిపడా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

అవే వెతలు!