
జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఊరట
అనంతగిరి: జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరటనిచ్చిందని చేవెళ్ల ఎంపీ, జీఎస్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై వికారాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తగ్గిన జీఎస్టీతో ప్రజలకు కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందన్నారు. వస్తు వినియోగ పన్ను తగ్గింపు అంశం ప్రజల్లోకి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియాను కోరారు. జీఎస్టీ తగ్గింపును వ్యక్తిగత, రాజకీయ కోణాల్లో కాకుండా ప్రజాప్రయోజనాల అంశంగా పరిగణించాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జీఎస్టీ అంశాన్ని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
వారికోసమే అలైన్‌మెంట్ మార్పు
బడా బాబుల భూములను కాపాడేందుకే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని ఎంపీ కొండా ఆరోపించారు. ప్రస్తుత ప్లాన్‌లో పేద, మధ్య తరగతి రైతుల భూములే పోతున్నట్లు తెలుస్తోందన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఇస్తుందని, భూసేకరణ, అలైన్‌మెంట్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టంచేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్ని పనులూ తానే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జిల్లా అధ్యక్షుడికి చేదు అనుభవం
ఇదిలా ఉండగా ప్రెస్‌మీట్ చివరి దశలో అక్కడికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి సాధారణ కార్యకర్తలా సమావేశంలో కూర్చున్నారు. ప్రెస్ మీట్ అనంతరం బయటకు వచ్చేశారు. అదే గదిలో కూర్చున్న ఎంపీ ప్రెస్‌మీట్ తర్వాత డోర్ పెట్టేసి పార్టీ నాయకులతో మాట్లాడారు. డోర్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన జిల్లా అధ్యక్షుడికి మీరు అక్కడే వెయిట్ చేయండి అని సూచించారు. సమావేశం అనంతరం ఎంపీతో మాట్లేందుకు ప్రయత్నించినా నేను తిరుపతి వెళ్తున్నా, ఫ్లైట్ టైమ్ అయిపోతుందంటూ కారులో హైదరాబాద్ బయల్దేరారు. ఈ సమావేశంలో జీఎస్టీ జిల్లా ప్రచారక్ ఈశ్వరప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, రమేశ్‌కుమార్, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు వడ్లనందు, అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, నందు, చరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ, జీఎస్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి