
సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్
● పట్టణ పరిశుభ్రతను కాపాడుదాం
● మున్సిపల్ కమిషనర్ యాదగిరి
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ యాదగిరి చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఇందిరానగర్, రహ్మత్‌నగర్, హమాలీ బస్తీ, గుండుపీర్ల ప్రాంతంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణాన్ని స్వచ్ఛత, పరిశుభ్రత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందుకు వారంలో రెండు వార్డులను ఎంపిక చేసుకుని ఆయా వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసి, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిక్, వాటర్ సప్‌లై, శానిటేషన్ తదితర విభాగాల అధికారులతో వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎలాంటి సమస్యలున్నా వార్డు ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు సైతం పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు తోడ్పాటునందించాలన్నారు. విధిగా తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే దోమలు, ఈగలు చేరి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమేశ్, వెంకటయ్య, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, పలు శాఖల అధికారులు, సిబ్బంది మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు.