
గర్భిణికి కుళ్లిన కోడిగుడ్లు
బంట్వారం: మండల పరిధిలోని యాచారం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలకు పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ గర్భిణికి రెండు రోజుల కిందట ఇంటికి తీసుకు వెళ్లేందుకు కోడి గుడ్లు ఇచ్చారు. ఆమె సోమవారం ఆమ్లెట్ వేసుకునేందుకు కోడి గుడ్లను పగుల గొట్టగా కుళ్లిపోయి నల్లటి బూజులా బయటికి వచ్చింది. కుళ్లిన గుడ్లు ఇవ్వడంపై ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ధనలక్ష్మిని సంప్రదించగా.. యాచారం సెంటర్‌లో ఓల్డ్ స్టాక్ పంపిణీ చేసినట్లు తెలిసిందన్నారు. తాను ఎప్పటికప్పుడు గుడ్లతో పాటు ఇతర సరుకులు చెక్ చేస్తూ ఉంటానన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
యాచారం అంగన్‌వాడీ కేంద్రంలో వెలుగు చూసిన ఘటన