
రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
అనంతగిరి: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ సోమవారం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు వడ్ల నందు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధిగా చెల్లిస్తేనే ప్రైవేట్ కళాశాలలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని విద్యార్థులకు, యాజమాన్యాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, భూమయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్