
వాస్తవాలు తెలుసుకోవాలి
తుర్కయంజాల్: మేధావులు మౌనంగా ఉంటే చరిత్రను వక్రీకరించే అవకాశం ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం తుర్కయంజాల్‌లోని అరుణ కన్వెన్షన్ హాల్‌లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం– వాస్తవాలు, వక్రీకరణ’ అంశంపై టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. 1946 సెప్టెంబర్ 11న ప్రారంభమైన సాయుధ పోరాట పిలుపు చారిత్రక మలుపుగా నిలిచిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. నిజాం ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ పోరాట ఫలితంగానే తెలంగాణలో నిజాం పాలన అంతం కావడం, ప్రజలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించడం, పేదలకు వ్యవసాయ భూమి దక్కాయని అన్నారు. బీజేపీ ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు తామే సాయుధ పోరాటాన్ని నడిపినట్లు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేటి తరం యువత వాస్తవాలను గ్రహించి, చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షుడు బింగి రాములయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుగంధ, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాస్