
వెంకన్న కోవెలకు రూ.110 కోట్లు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ.33 కోట్లు మంజూరు చేసింది. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా విస్తరణతో పాటు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలోపు పనులు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు శ్రీవారి ఆలయ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ పునరుద్ధణ పనుల్లో భాగంగా దేవాలయ నిర్మాణంతో పాటు వివిధ పనులకు స్తపతిలు రూపొందించిన నక్షలను ముఖ్యమంత్రి ఆమోదించారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించనున్నారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధం చేశారు. క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు, మాఢ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు.
గుడి విస్తరణకు రెండు ఎకరాలు
కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 87,36 గజాల స్థలం సేకరించి అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించనున్నారు. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. భూమి విలువ, భవనం విలువను ఆర్‌అండ్‌బీ అధికారులు లెక్క కట్టి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. అదనంగా రూ.5 లక్షల సాయం, ఒక ఏడాది కుటుంబ అవసరాల కోసం రూ.40 వేలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి అయ్యే ఖర్చు (ట్రాన్స్‌పోర్ట్)రూ.60 వేలు, పశువుల దొడ్డి నిర్వహణకు రూ.25 వేలు, చేతి వృత్తులు, కుల వత్తుల వారికి రూ.30 వేలు, ఇతర ఖర్చుల కోసం రూ. 60వేలు చెల్లిస్తారు. ఇంటి స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు.

వెంకన్న కోవెలకు రూ.110 కోట్లు