
పేరుకే పెద్ద మున్సిపాలిటీ..
తాండూరు: జిల్లాలోనే తాండూరు అతి పెద్ద మున్సిపాలిటీ.. 36 వార్డులు.. 19 వేల గృహాలు, 95 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో చెత్త సేకరణకు 280 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం. ప్రస్తుతం 49 మంది రెగ్యులర్, 171 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 50మంది మున్సిపల్ కార్యాలయంలోని ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డుల నుంచి రోజూ 40 టన్నుల చెత్త వస్తోంది. ఇందుకోసం 36 ఆటోలు, 16 ట్రాక్టర్లు అవసరం కాగా కేవలం 24 ఆటోలు, 9 ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 10 ఆటోలు, రెండు ట్రాక్టర్లు పని చేయడం లేదు. దీంతో చెత్త సేకరణ సిబ్బందికి భారంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు కూడా అందడం లేదు. రెండు నెలల క్రితం కిట్ల కొనుగోలుకు రూ.50 లక్షలు కేటాయించారు. అందులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ వాహనాల కొనుగోలుపై, సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.