
వాగులో కలుస్తున్న ప్రాణాలు!
తాండూరు రూరల్: మండలంలోని తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో ఉన్న సంగెంకలాన్ గ్రామ దుస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వానాకాలం వచ్చిందంటే దినమొక గండంగా గడపాల్సిందేనని వాపోతున్నారు. వర్షం కురిస్తే చాలు ఊరి చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లుతాయని చెబుతున్నారు. వరద ఉధృతిని అంచనా వేయలేక గ్రామానికి చెందిన పలువురు వరదలో కొట్టుకుపోయి చనిపోయారని చెబుతున్నారు. గత గురువారం దిడ్డివాగులో కొట్టుకుపోయిన మొగులప్ప శుక్రవారం శవమై తేలిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం డిపో వాగులో పడి భక్తుంపల్లి పెంటప్ప మృతిచెందాడు. ప్రమాదానికి గురైన మరికొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కర్ణాటక సరిహద్దులో ఉన్న తమ గ్రామం శివారులోంచి పారుతున్న వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
సంగెంకలాన్ చుట్టూ పారుతున్న దిడ్డివాగు, డీపో వాగు
గ్రామంలోకి వెళ్లాలంటే వీటిని దాటాల్సిందే
వర్షాకాలంలో తరచూ ప్రమాదాలు
వంతెనలు నిర్మించాలని ప్రజల అభ్యర్థన