
పురుగు మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే మోతిలాల్(40) డ్రైవర్ పని చేసుకుంటూ జీవించేవాడు. కుటుంబ కలహాలతో ఈ నెల 8వ తేదీన పురుగు మందు తాగాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.
బతుకుపోరాటంలో ఆగిన గుండె
కందుకూరు: బతుకు పోరాటంలోనే ఓ గుండె ఆగిపోయింది. మండల పరిధిలోని కటికపల్లికి చెందిన ఎంట్ల అశోక్(35) టిప్పర్‌పై డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద డస్ట్ లోడ్ నింపుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో వాహనాన్ని పక్కకు నిలిపేసి, డ్రైవింగ్ సీట్లోనే ప్రాణం వదిలాడు. మృతుడిడి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అశోక్ మృతితో వీరంతా దిక్కులేని పక్షులయ్యారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.