
యూరియా ఇవేం వెతలయా!
ఎండా, వానలకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమించి సిరులు పండించే అన్నదాతలకు యూరియా వెతలు వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం సైతం సరిపడా యూరియా బస్తాలు దొరకక ఫర్టిలైజర్ దుకాణాలు, ఆగ్రో సెంటర్ల ఎదుట బారులు తీరారు. పలుచోట్ల భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ సామరస్యంగా జరిగింది.
ధారూరు: మండల పరిధిలోని మోమిన్‌ఖుర్దు గ్రామంలో రైతులు యూరియా కోసం ఆగ్రో సెంటర్ వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. టోకెన్లు ఇష్టారాజ్యంగా ఇవ్వడం, అసలైన వారికి దొరక్కపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో రైతులు రాగా ఏఓ పత్తా లేకపోవడం, ఏఈఓ ఒక్కడే ఇష్టానుసారంగా టోకెన్లు జారీ చేయడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. శనివారానికి 251, సోమవారానికి 200 టోకెన్లు ముందుగానే జారీచేశారు. క్యూలైన్‌లో చెప్పులు పెట్టి మరీ రైతులు వేచి ఉన్నారు.
తప్పని యూరియా కష్టాలు!
దోమ: చాలీచాలని యూరియా సరఫరాతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజులకు ఓ లారీలో ఆగ్రోస్ కేంద్రాలకు కొంతమేర యూరియాను సరఫరా చేస్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. శనివారం మండల పరిధిలోని మోత్కూర్ ఆగ్రోస్ కేంద్రంతో పాటు దిర్సంపల్లిలోని ఆగ్రోస్ కేంద్రానికి 30 టన్నుల యూరియాను అధికారులు సరఫరా చేశారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో రైతులు బారులు తీరి పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలైన్‌లో పెట్టి వెచి ఉన్నారు. అందులో కొంత మందికి మాత్రమే యూరియా అందడంతో మిగతా వారు అధికారులపై మండి పడ్డారు. రాష్ట్రంలో రైతులను విస్మరించి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే సరిపడా యూరియాను అందించేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
దోమ: మోత్కూర్ ఆగ్రోస్ కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు
ధారూరు: మోమిన్‌ఖుర్దులో యూరియా కోసం క్యూలైన్‌లో రైతులు
ఇష్టానుసారంగా టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహం
పలుచోట్ల ఆందోళన చేపట్టిన రైతులు
దుకాణాల ఎదుట కర్షకుల పడిగాపులు
క్యూ లైన్లలో చెప్పులు ఉంచి నిరీక్షణ

యూరియా ఇవేం వెతలయా!

యూరియా ఇవేం వెతలయా!