
ధారూరులో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
ధారూరు: మండల కేంద్రంలో శనివారం ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జామ మసీదు నుంచి కమాన్, బస్టాండు మీదుగా లతీఫున్నీసా మసీదు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలోని దారుస్సలాం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలోని మోమిన్‌కలాన్, నాగారం, దోర్నాల్, స్టేషన్‌ధారూరు, కుక్కింద, కేరెళ్లి, ధారూరు, ఎబ్బనూర్ తదితర గ్రామాల నుంచి ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు హాజరైనట్లు వివరించారు. దారుస్సలాంలో రాత్రంతా జాగారం, ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ధారూరు ఎంఐఎం అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దారుస్సలాంకు తరలిన ముస్లింలు