ఆధునికత వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

ఆధునికత వైపు అడుగులు

Sep 14 2025 9:06 AM | Updated on Sep 14 2025 9:06 AM

ఆధునికత వైపు అడుగులు

ఆధునికత వైపు అడుగులు

కొడంగల్‌: మున్సిపాలిటీల్లో కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఇంటికి ఆన్‌లైన్‌లో డిజిటల్‌ నంబర్‌ కేటాయిస్తున్నారు. ఆస్తి హక్కుపై ప్రజలకు భరోసా కల్పించడానికి రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో పారదర్శకత.. జవాబుదారీతనం ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అధికారులు తప్పు చేసినా.. ఇంటి యజమాని తప్పు చేసినా.. ఎవరు తప్పు చేసినా ఇంటి యజమానిదే బాధ్యత. ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్‌ చట్టాన్ని అతిక్రమిస్తే పాతిక రేట్లు జరిమానా విధించనున్నారు.

ఆచరణలోకి డిజిటలైజేషన్‌

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి ఇల్లు ఆన్‌లైన్‌లో ఉండాలి. ఆన్‌లైన్‌లో లేని ఇంటికి జరిమానాలు విధించే అధికారం మున్సిపల్‌ సిబ్బందికి ఉంది. ప్రతి ఇంటికి డిజిటల్‌ నంబర్‌ ఉండాలి. నంబర్‌తో ఆస్తులకు భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఇళ్లకు నూతన డిజిటలైజేషన్‌ విధానం ఆచరణలోకి వచ్చింది. ప్రతి ఇంటికి డిజిటల్‌ నంబర్లు కేటాయించాలని మున్సిపల్‌ శాఖ నిర్ణయించింది. దీని ద్వారా యజమాని ఇంటి వివరాలతో పాటు పన్ను చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే విషయాలు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

వార్డుల ఆధారంగా

మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు వార్డుల ఆధారంగా ఇంటి నంబర్లు ఉన్నాయి. మొదటి అంకెతో మొదలై మధ్యలో అడ్డగీత తర్వాత ఇంటి నంబర్లు ఉన్నాయి. బై నంబర్లు పెరగడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇళ్ల చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. పెరిగిన నివాస గృహాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని డిజిటల్‌ నంబర్లను ఇళ్లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లోకేషన్‌తో సమాచారం తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారు.

డిజిటల్‌ నంబర్లు

నూతన విధానంలో ఇకపై మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇళ్లకు డిజిటల్‌ నంబర్‌ ప్లేట్‌ ఇవ్వనున్నారు. పిన్‌కోడ్‌ తరహాలో రాష్ట్ర, జిల్లా, పురపాలిక, వార్డులను తెలిపేలా కోడ్‌ ఉంటుంది. డిజిటల్‌ ఇంటి నంబర్‌ను ఇంటర్‌నెట్‌లో నమోదు చేయడం ద్వారా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఇంటి అడ్రస్‌ తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంటి నంబర్‌తో పాటు బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పన్నుల చెల్లింపు, బకాయిల వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా ఇండ్లు కట్టుకునే వారు ఇంటి ప్లాన్‌ ప్రకారమే కట్టాలి. ఇంటి ప్లాన్లు ఇచ్చే ప్లానర్‌ తప్పు చేస్తే వారి లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంది. మున్సిపల్‌ పరిధిలో ఇంటి నిర్మాణాలు చేయాలంటే నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

ప్రతి ఇల్లూ ఆన్‌లైన్‌లో నమోదు

ఆస్తి హక్కుపై పూర్తి భద్రత

మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం

చర్యలు చేపట్టిన పుర అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement