
వర్షాలకు కూలిన ఇల్లు
పరిగి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలింది. పట్టణ కేంద్రంలోని వల్లభనగర్ కాలనీలో షమీభేగంకు చెందిన ఇల్లు వర్షానికి శుక్రవారం రాత్రి కూలిపోయింది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో నలుగురు పిల్లలలో ఉన్న చిన్నపాటి ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇల్లు కూలడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వచ్చిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులపై శ్రద్ధ అవసరం
కొడంగల్ రూరల్: విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల సహాయ అభివృద్ధి తాండూరు డివిజన్ అధికారి వి.పాండు సూచించారు. శనివారం పట్టణంలోని ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న వసతులను వివరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నట్లు, వసతి గృహం నుంచి విద్యార్థులకు అందించే వస్తువులు, స్పెషల్ తరగతులు తదితర విషయాలను వివరించారు. చదువులో వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులతో బోధనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారులు హన్మంత్‌రెడ్డి, వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
బొంరాస్‌పేట: మండల కేంద్రం శివారులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోస్గి మండలం తొగాపూర్‌కు చెందిన బొప్పలి వెంకటేశ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో బొంరాస్‌పేట చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్ కాళ్లు, చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. క్షతగాత్రుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.
వరద ఉధృతితో రాకపోకలకు అవస్థలు
ధారూరు: మండల కేంద్రంలో శనివారం జరిగిన కూరగాయల సంతకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు వాగు ఉధృతితో తిరిగి వెళ్లలేకపోయారు. భారీ వర్షానికి చింతకుంట– హరిదాస్‌పల్లి రోడ్డు మీదుగా ప్రవహించిన వాగు వద్దే ఆగిపోయారు. రాత్రి 7 గంటలైనా వరద తీవ్రత తగ్గకపోవడంతో అక్కడే కూర్చుండిపోయారు. పాలకులు స్పందించి, వాగులపై కల్వర్టులు నిర్మించాలని కోరారు.

వర్షాలకు కూలిన ఇల్లు

వర్షాలకు కూలిన ఇల్లు