
యూరియా దందాపై షోకాజ్
బషీరాబాద్: అధిక ధరలకు యూరియా విక్రయించిన సాయిధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపు యజమానిపై చర్యలకు వ్యవసాయ అధికారులు సిద్ధమయ్యారు. శనివారం ‘యూరియా దందా.. రైతు బెంగ’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి బషీరాబాద్ వ్యవసాయ అధికారిణి అనిత స్పందించారు. ఈ మేరకు షాపు యజమాని రాఘవేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులో మూడు అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఐదు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్(ఎఫ్సీఓ) 1985 చట్టం ప్రకారం యూరియా బస్తా ధర రూ.266.50గా నిర్ణయిస్తే రైతులకు అంతకంటే ఎక్కువ ధరకు ఎందుకు విక్రయించారని, ఫర్టిలైజర్ షాపు ముందు ధరల పట్టిక ఎందుకు ఏర్పాటు చేయలేదని, అలాగే రైతులకు రసీదులు ఎందుకు ఇవ్వలేదో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. రైతులను మోసం చేస్తే లైసెన్సు రద్దు ఎందుకు చేయరాదని హెచ్చరించారు. సాయిధనలక్ష్మి ఫర్టిలైజర్ షాపులో డీఏపీ బస్తాకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350కు బదులు రూ.1,450 విక్రయిస్తున్నారు. ఇదే విషయమై వ్యవసాయ అధికారులకు రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
ఫర్టిలైజర్ షాప్ యజమానికి నోటీసులు

యూరియా దందాపై షోకాజ్