మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ

Sep 13 2025 2:32 AM | Updated on Sep 13 2025 7:29 AM

కుల్కచర్ల: ఎస్‌బీఐ రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పించనున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి జిల్లా సంచాలకులు మహ్మద్‌అలీ ఖాన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలలోని మహిళలందరికీ ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పిస్తామని, ఆసక్తి ఉన్న మహిళలు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ

దుద్యాల్‌: మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామానికి చెందిన నాయికోటి శ్రీకాంత్‌, కుదురుమల్ల గ్రామానికి చెందిన సున్నపు దస్తప్ప వేర్వేరు ప్రాంతాల్లో తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు. వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఈఐఆర్‌ పోర్టల్‌ సహకారంతో మొబైల్స్‌ గుర్తించి కానిస్టేబుల్‌ శంకర్‌, శ్రీశైలం శుక్రవారం బాధితులకు అందజేశారు.

యువతి పెళ్లికి కానుక

రూ.1.11లక్షలు అందజేసిన కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్‌ అన్సారీ

బంట్వారం: కోట్‌పల్లి మండలం కరీంపూర్‌లో ఓ యువతి వివాహానికి కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్‌ అన్సారీ రూ.1.11లక్షలు అందజేశారు. వివరాలలోకి వెళితే.. కరీంపూర్‌లో ఆడపిల్ల వివాహానికి రూ.1.11లక్షలు, యువకుడికి రూ.51,100 వివాహ కానుక ఇస్తానని ఇటీవల ప్రకటించారు. శుక్రవారం గ్రామంలో కావలి రాజు చైతన్యకుమారి దంపతుల కూతురు శ్రీవర్ధిని వివాహానికి రూ.1.11లక్షల నగదును యువతి తల్లిదండ్రులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రైతు

ధారూరు: పశుగ్రాసం మేస్తున్న ఎద్దు విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని జీడిగడ్డతండా సమీప వ్యవసాయ పొలంలో చోటుచేసుకుంది. నేనావత్‌ రాములునాయక్‌కు చెందిన ఎద్దు మేతమేస్తూ రోడ్డు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లింది. విద్యుదాఘాతంతో కొట్టుకుంటుండగా రైతు దగ్గరా వెళ్లేందుకు యత్నించాడు. గమనించిన సమీపరైతులు అడ్డుకోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎద్దు విలువ సుమారు రూ.70వేలు ఉంటుందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు కోరాడు.

గణితఫోరం అధ్యక్షుడిగా శ్రీధర్‌రెడ్డి

బషీరాబాద్‌: గణిత ఫోరం తాండూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా జీవన్గీ పాఠశాలకు చెందిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం తాండూరు నంబర్‌–1 పాఠశాలలో నియోజకవర్గ గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ గణిత ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు గణిత ఫోరం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి క్విజ్‌లు, పోటీ పరీక్షల ద్వారా గణిత మెలకువలను నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ 22న శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ వీరేశం, జిల్లా రీసోర్స్‌ పర్సన్‌లు, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ 1
1/3

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ 2
2/3

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ 3
3/3

మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement