
కూటమి ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం
దోమ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అప్రజాస్వామికమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పీర్ మహమ్మద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, మీడియాపై దాడులకు తెగబడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఆ దిశగా సాక్షి ముందుకు సాగడంలో తప్పేముందని ఏపీ సర్కారును ప్రశ్నించారు. కథనాలు, వార్తల్లో ఏవైనా అవాస్తవాలు, లోటుపాట్లు ఉంటే వివరణ, సంజాయిషీ కోరవచ్చని తెలిపారు. కానీ కేవలం కక్ష సాధింపు ధోరణితో కేసులు బనాయించడం పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికై నా ఇలాంటి చర్యలను ఆపకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహమ్మద్