
పౌర సేవలపై ప్రత్యేక దృష్టి
● అభివృద్ధి పనుల్లో అలసత్వం వీడాలి
● కొత్తగా విధుల్లో చేరిన మున్సిపల్ ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలి
● తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: మున్సిపల్ పరిధిలో అధికారులు పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ స్వప్నపరిమళ్‌లతో కలిసి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు విరివిగా వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వార్డులలో ప్రతీ రోజు చెత్త సేకరణ, మురుగు కాల్వలు శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే బాగు చేయించాలన్నారు. వార్డుల వారీగా అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే టౌన్ ప్లానింగ్ సిబ్బంది మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాకాకుండా కాపాడాలన్నారు.
అభివృద్ధి పనులు వేగిరం
వర్షాల కారణంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తగ్గిన వెంటనే పనులు వేగిరం చేస్తామన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మరో రూ.50 కోట్లతో చిలుకవాగు ప్రక్షాళన పనులు పూర్తి చేస్తామన్నారు. లారీ పార్కింగ్ కోసం ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ నిర్వాహకులు ఒక్కొక్కరు దుకాణాల కోసం రూ.10 లక్షలు కడితే టీఎస్‌ఐఐసీ లారీ పార్కింగ్‌తో పాటు దుకాణ సముదాయాలు నిర్మించి ఇస్తారని చెప్పిన ముందుకు రావడం లేదన్నారు. నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లను జిన్‌గుర్తి పారిశ్రామిక వాడకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు తదితరులున్నారు.
ఆలయ కమిటీ తీర్మానమే ఫైనల్
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో ఆలయ కమిటీ తీర్మానమే ఫైనల్.. దుకాణదారులు నిర్మాణ పనులకు సహకరించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని భావిగి భద్రేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పాత దుకాణాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతన్నారు. పలువురు దుకాణదారులు ఖాళీ చేయకపోవడంతో పనులకు అంతరాయం కలుగుతోంది. ఈవిషయమై ఆలయ కమిటీ అధ్యక్షుడు పటేల్ కిరణ్‌తో పాటు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం కమిటీ సభ్యులతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ తీర్మాణం మేరకే నిర్మాణ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. దుకాణం ఎంత విస్తీర్ణంలో ఉంది. నిర్మాణ పనులు సైతం అంతే స్థలంలో జరుగుతాయన్నారు. ఏమైన అనుమానాలు ఉంటే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రైవేటు ఇంజినీర్లను పెట్టుకొని సర్వే చేయించుకోవాలని ఎమ్మెల్యే దుకాణదారులకు తెలిపారు. దుకాణం ఖాలీ చేసిన ప్రతి ఒక్కరికి దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.