
బాలిక కిడ్నాప్ కేసులో..
బాలుడి తల్లిదండ్రులకు రిమాండ్
కుల్కచర్ల: ప్రేమ పేరిట బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాలికను.. అదే కాలనీకి చెందిన బాలుడు గత ఏప్రిల్ 10న అపహరించుకు వెళ్లాడు. ఇందుకు బాలుడి తల్లిదండ్రులు రాజమ్మ, సత్తయ్య సహకరించారని, బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించిన పోలీసులు శుక్రవారం బాలుడి తల్లిదండ్రులను రిమాండ్‌కు తరలించారు. మైనర్ల ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో సహకారం అందిస్తే పోక్సో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
స్తంభించిన రాకపోకలు
ధారూరు: కాగ్నానదితో పాటు మండలంలోని వాగులన్నీ శుక్రవారం నిండుగా ప్రవహించాయి. గట్టెపల్లి గ్రామ అడవిలోని బాలోనికుంట నిండి పెద్ద చెరువులోకి వరద పారింది. ఈ నీరు తట్టెపల్లితండా రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో ధారూరు– గట్టెపల్లి, గట్టెపల్లితండాల మధ్య రాకపోకలు స్తంభించాయి. తప్పని పరిస్థితిలో కొంతమంది రుద్రారం మీదుగా వచ్చివెళ్లారు.
కల్లాల్లోని పంట వరదపాలు!
ధారూరు: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని పలువురు రైతులు సాగు చేసిన పంటలు పాడవుతున్నాయి. రాంపూర్‌తండా గిరిజనులు సాగుచేసిన వేరుశనగ పంట దెబ్బతింది. వరుస వర్షాలతో మూడు రోజులుగా పొలాలకు వెళ్లని రైతు శుక్రవారం పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు యాభై ఎకరాల్లో కోసిన వేరుశనగ పంట కల్లాలనుంచి కొట్టుకుపోయింది. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.
స్కూటీ డిక్కీలోంచి
నగదు చోరీ
శంకర్‌పల్లి: బ్యాంకులో నగదు డిపాజిట్ చే సేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని.. క్యూలైన్ కొంపముంచింది. ఈ ఘటన శుక్రవారం శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్‌కి చెందిన ప్రమోద్ గౌడ్(25) పట్టణంలో ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయన తల్లి డ్వాక్రా సంఘానికి సంబంధించిన రూ. 2.97లక్షల డబ్బులను యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పింది. మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లగా క్యూలైన్ ఎక్కువ ఉంది. దీంతో ల్యాబ్‌లో పనిచేసుకుని వద్దామని నగదును స్కూటీలో పెట్టుకుని వెళ్లాడు. 15నిమిషాల తర్వాత బయటకి వచ్చి చూడగా నగదు మాయమైంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.