
వాగులో గల్లంతై.. శవమై తేలాడు
తాండూరు రూరల్: దిడ్డి వాగు దాటుతూ గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. మండల పరిధిలోని సంగెంకలాన్‌కు చెందిన భుక్తంపల్లి మొగులప్ప(47) గురువారం చెట్టినాడు ఫ్యాక్టరీ–సంగెంకలాన్ మధ్యలో దిడ్డి వాగు దాటుతూ కొట్టుకుపోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వాగు ఉధృతంగా ప్రవహించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. తాండూరు ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ జలేంధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది 16 మందితో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించి గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచ్ మేగనాథ్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రకృతి విపత్తు సాయం కింద రూ.5లక్షల విలువైన చెక్కును మృతుడి భార్య లలితమ్మకు అందజేశారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు భీంరెడ్డి, సతీశ్‌రెడ్డితో మాట్లాడి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుబీమా కింద రూ.5లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. దిడ్డివాగుపై తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం మృతదేహానికి తాండూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ సహాయక చర్యల్లో తహసీల్దార్ తారాసింగ్, ఆర్‌ఐ గోపి, ఎంపీఓ వీరప్ప, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, ఎస్‌ఐ రాథోడ్ వినోద్ కానిస్టేబుళ్లు, నాయకులు శ్రీను, నాగప్ప, ధారాసింగ్, ఉత్తమ్‌చందు, రాజేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి ఉన్నారు.
మృతదేహంతో బంధువుల ఆందోళన
ప్రకృతి విపత్తు సాయం కింద రూ.5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ

వాగులో గల్లంతై.. శవమై తేలాడు