
బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
అనంతగిరి: సమాజంలో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు అన్ని మతాల పెద్దలు కృషి చేయాలని సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయం, జిల్లా కేంద్రంలోని పలువురు పురోహితులు, ఖాజీలతో బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. బాల్యవివాహాలతో ప్రసూతి, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నర్సింలు, జి.రమేశ్, రోజా, పురోహితులు, ఖాజీలు తదితరులు పాల్గొన్నారు.
మహిళల రక్షణకే షీటీం
పరిగి: మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు షీటీం పనిచేస్తుందని షీటీం ఇన్‌చార్జి నర్సింలు అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని శ్రీ సాయి ఒకేషనల్ కళాశాలలో షీటీం నిర్వహనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై, మహిళలపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే షీటీం నంబర్ 181కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తమ తల్లిదండ్రులకు ఆన్‌లైన్, బ్యాంకింగ్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీశైలం, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.
సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ యాదవ్

బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి