
యువకుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
ధారూరు: యువకుడిలో దాడిలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నీరటి అంజిలయ్య అలియాస్ ఆంజనేయులు(45), భారతమ్మ దంపతులు గ్రామంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించుకుంటూ జీనవం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 13న యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేశారు. ఆయిల్ తక్కువగా ఉందని నిర్వాహకులతో సదరు యువకులు గొడవకు దిగారు. మారణాయులతో దాడికి దిగారు. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన గ్రామానికి చెందిన అమర్‌నాథ్‌పై సైతం దాడి చేసి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడిలో అంజిలయ్య, భారతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. భారతమ్మ మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు బండరి కృష్ణ, అనంతయ్యపై కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. వీరి దాడిలో గాయపడిన అంజిలయ్య మంచాన పడి ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. తన భర్త మృతికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.