
యూరియా.. లేదే దయ!
రైతులు పంట సాగుకు కంటే వాటికి ఎరువులు తీసుకువచ్చేందుకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా సరిపోక రోడ్లపై నిరసనలు, ఆఫీసుల ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. ఎండ, వాన లెక్క చేయకుండా గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఆయా సరఫరా కేంద్రాలకు చేరుకుని చెప్పులు, కర్రలు, రాళ్లు క్యూలైన్లలో ఉంచుతున్నారు.
సరిపడా సరఫరా చేయండి
మోమిన్‌పేట: యూరియా కోసం రైతు గోస పడుతూనే ఉన్నాడు. మోమిన్‌పేట, మేకవనంపల్లి పీఏసీఏస్‌లలో, వెల్‌చాల్ రైతు మిత్ర సంఘానికి అగ్రోస్ తదితర దుకాణాలకు యూరియా వస్తున్నా సరిపడా రావడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే ఆయా కేంద్రాలకు చేరుకుని రాళ్లు, చెప్పులు, కర్రలు క్యూలో ఉంచి పక్కన పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుకు అవసరమైన మేర యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పూడూరు: యూరియా కోసం రైతులు గురువారం మండల పరిధిలోని మన్నెగూడ, చన్గోముల్ మన గ్రోమార్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. యూరియా బస్తాలు కోసం రైతులు ఎగబడటంతో సరఫరాలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులను క్యూలైన్‌లలో ఉంచి ఎరువులను పంపిణీ చేశారు. చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి తులసీరాం దగ్గరుండి ఎరువుల పంపిణీ చేశారు.
ఆగని ఆందోళన
ధారూరు: ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నుంచి పంపిణీ చేయాల్సిన యూరియాను గురువారం రైతు వేదిక వద్ద ప్రారంభించారు. ముందుగా టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా తీసుకెళుతుంటే తర్వాత వచ్చిన వారు మాకెందుకు ఇవ్వరంటూ ఆందోళనకు దిగారు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా రైతుల ఆందోళన ఆగలేదు.
నాగసమందర్‌లో లొల్లి
నాగసమందర్ రైతు వేదికలో యూరియా ఇస్తున్న విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజామునే క్యూ కట్టారు. మధ్యాహ్నం అయినా అధికారులు రాకపోవడంతో రైతులు సిబ్బందిపై మండిపడ్డారు. ధారూరు నుంచి నాగసమందర్‌కు రావడానికి మధ్యలో ఉన్న రోడ్డుపై నుంచి ప్రాజెక్టు నీరు ప్రవహిస్తుందని ఏఈఓ, ధారూరు పీఏసీఎస్ సిబ్బంది చెప్పినా గొడుగులు పట్టుకుని సాయంత్రం వరకు వేచిచూసి ఇళ్లకు వెళ్లిపోయారు.
గోదాముల వద్ద రైతుల ఇక్కట్లు
గంటల తరబడి వేచిచూసినా ఒక్క రైతుకు ఒకటే బస్తా
సరిపడా సరఫరా చేయాలని ఆందోళనలు