
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
● ఏపీ పోలీసుల కేసులను ముక్తకంఠంతో ఖండన
● ఎడిటర్, పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావం
సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
సాక్షి, వికారాబాద్: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనని అభిప్రాయపడ్డారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు పెట్టి ఆఫీసుకు వచ్చి నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. పత్రికలో వచ్చిన కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి గానీ ఏకంగా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వివరణ కోరాలి
పత్రికలో వచ్చే ప్రతీ విమర్శపై కేసు పెట్టాలనుకోవడం సరికాదు. ఆ వార్త విషయంలో వివరణ కోరాలి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. అకారణంగా అరెస్టులు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ముఖ్యమైనది. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికం.
– శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ)
దాడులు అప్రజాస్వామికం
పత్రికలపై దాడులు అప్రజాస్వామికం. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు విస్తృత ప్రచారం చేసే మీడియా, ప్రజా సమస్యలపై అంతకంటే రెట్టింపు స్థాయిలో స్పందిస్తోంది. చట్టాలకు లోబడి కథనాలు రాస్తే దాడులు చేయడం శోచనీయం. ఎవరి పరువుకై నా భంగం వాటిల్లినట్లు భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. యూనియన్లు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది.
– ఎస్.రవిశంకర్, సీనియర్ జర్నలిస్ట్, టీయూడబ్ల్యూజే
అవమానించడమే
కూటమి ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల హమీల అమలుపై, ప్రభుత్వ తప్పులను ప్రచురిస్తే కేసులు పెట్టడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వార్తలపై అభ్యంతరాలు ఉంటే నోటీసులు ఇవ్వాలి, ఖండించాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు, అధికారులు సైతం చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు. పత్రిక స్వేచ్ఛకు భగం కలిగించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.
– వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి
సమాజం హర్షించదు
ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ముఖ్యమైంది. ఒకరు చెప్పిన వార్తను ప్రచురించినందుకుగాను సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడం సమంజసం కాదు. మీడియా గొంతు నొక్కేయాలని చూడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. సమాజం కక్ష సాధింపు చర్యలను హర్షించదు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న ఈ ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది.
– రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
సమంజసం కాదు
సమాజంలో ప్రజా సమస్యలను జర్నలిస్టులు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తారు. ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా ఉంటారు. సమాజం కోసం అహర్నిశలు పాటుపడే జర్నలిస్టులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేయడం సమంజసం కాదు. పత్రికల్లో పనికట్టుకుని వార్తలు రాస్తే తప్పు పట్టాలి. నాయకులు అన్న ప్రకటనలు రాస్తే కేసులు పట్టడం పత్రికా స్వేచ్ఛను హరించినట్లే.
– బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు