
‘ఆహార భద్రత’ను అమలు చేయాలి
● ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
అనంతగిరి: ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. ఆహార భద్రత చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ శాఖల నివేదికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హక్కుదారులకు ఎలాంటి భంగం కలగకుండా న్యాయం చేకూర్చేలా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం తూకంలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చౌక ధరల దుకాణాల వద్ద ఫిర్యాదుల పట్టిక, అధికారుల ఫోన్ నంబర్లను, పనిచేసే వేళలు ప్రదర్శించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీల్లో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, మెనూ పట్టిక ప్రదర్శించాలన్నారు. విద్యా, నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలని చైర్మన్ సూచించారు. అంగన్వాడీలలో మాతా శిశువులకు పౌష్టిక ఆహారం కచ్చితంగా అందించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసు చంద్ర, డీఆర్డీఏ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ లలితా దేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ రేణుకాదేవి, ఫుడ్ సెక్యూరిటీ అధికారి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.