
చేపపిల్లల పంపిణీపై నీలినీడలు
పరిగి: భారీ వర్షాలతో ప్రస్తుతం చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. జిల్లాలోని అన్ని జల వనరులు నిండుకుండలా దర్శనమిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయలేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన మత్స్యపథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి జూన్, జూలైలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ ఏడాది ఆ ఊసే లేదు. మత్స్యశాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఒకవేళ పథకాన్ని కొనసాగించి చేప పిల్లలను ఆలస్యంగా చెరువులు, రిజర్వాయర్లలో వదిలితే వాటి ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మదనపడుతున్నారు. మత్స్య పథకం 2017న ప్రారంభించి 2023 వరకు ఏడు విడతల్లో చేప పిల్లలు పంపిణీ చేశారు.
నిధులు విడుదలైనా..
మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కలిగిన చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు జులై మాసంలోనే ప్రణాళికను సిద్ధం చేసుకునేది. పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియపై రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపదకు నిధులను కేటాయించింది. కానీ ఇప్పటివరకు పంపిణీపై ఎలాంటి ముందగుడు పడలేదు. జిల్లా వ్యాప్తంగా 830 చెరువులు కుంటలు ఉండగా, 16 ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే 133 మత్స్యకార సంఘాలున్నాయి. చెరువులు, ప్రాజెక్టులకు కలిపి 1.29 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు లక్ష్యాన్ని అధికారులు ఎంచుకున్నారు. రహూ, బొచ్చ, బంగారు తీగ వంటి చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. 35 ఎంఎం నుంచి 45ఎంఎం 1.04 కోట్లు, 80ఎంఎం నుంచి 100ఎంఎం చేప పిల్లలను 25లక్షల మొత్తం 1.29 కోట్ల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో వదలాల్సి ఉంది.
ఆలస్యంతో ఎదగని పిల్లలు
ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మత్స్యసంపదకు నిధులు కేటాయించారు. కానీ చేప పిల్లలను పంపిణీపై స్పష్టత లేదు. సకాలంలో పంపిణీ చేయకపోవడంతో చేపలు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం గతేడాది చేప పిల్లలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి చేయకపోవడంతో మత్స్యసంపదను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అంతేకాక ప్రైవేటులో ఇతర రాష్ట్రాల నుంచి చేప పిల్లలను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్నారు. చెరువుల్లో మేత కుళ్లితే చేపల ఎదుగుదల క్షీణిస్తుందని మత్స్యకారులు దిగులు చెందుతున్నారు.
పంపిణీ చేయాలి
గతేడాది చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రైవేటులో చేప పిల్లల కొనుగోలు కోసం రూ.లక్షలు వెచ్చించాం. ప్రభుత్వమే చేప పిల్లలను పంపిణీ చేస్తే మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలి.
– రమేశ్, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు దాదాపూర్
టెండర్లు పూర్తి
చేప పిల్లల పంపిణీకి టెండర్లను ఆహ్వానించాం. ప్రక్రియ పూర్తి కాగానే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. రెండు రోజుల్లో మొత్తం టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. త్వరలోనే చేప పిల్లలను పంపిణీ చేస్తాం. అక్టోబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
– వెంకన్న, జిల్లా మత్స్యశాఖ అఽధికారి
అదును దాటుతున్నా పడని ముందడుగు
గతేడాది సైతం పంపిణీ చేయని ప్రభుత్వం
ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
జిల్లాలో చేపపిల్లల పంపిణీ లక్ష్యం 1.29 కోట్లు
చెరువులు, కుంటలు: 830
రిజర్వాయర్లు: 16
మత్స్యకార సంఘాలు: 133

చేపపిల్లల పంపిణీపై నీలినీడలు