
ఏడీఏ లేక.. సేవలు సాగక
● పశువైద్యాధికారి పోస్టు ఖాళీ
● కొడంగల్ ఏడీఏకు తాండూరు ఇన్‌చార్జి బాధ్యతలు
తాండూరు రూరల్: పశువైద్యాధికారి లేక మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పశువైద్యాధికారి కార్యాలయంలో ఏడీఏ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఏడీఏగా పని చేసిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొడంగల్ పశువైద్య కార్యాలయంలో పని చేస్తున్న ఏడీఏ డాక్టర్ నోవాకు తాండూరు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఇప్పటివరకు సదరు అధికారి కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది మాత్రమే తాత్కాలికంగా పశువులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇన్‌చార్జి ఏడీఏ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పశువుల కాపరులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరులో ఉన్న రైతులు పశువుల చికిత్స చేసుకోవడానికి వస్తుంటారు. కానీ డాక్టర్ లేకపోవడంతో సిబ్బందితో చికిత్సలు చేస్తున్నారు.
డిప్యూటేషన్ల పర్వం
మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పశువైద్యాధికారి ఏడీఏ కార్యాలయంలో గొర్రెలు, మేకలు, ఎద్దులు, కుక్కలకు వైద్య సేవలు చేసేందుకు ధారూరు మండలం కుక్కింద పశువైద్యశాలలో పని చేస్తున్న ఫ్యారమేట్ సైదులును డిప్యూటేషన్‌పై తాండూరుకు వచ్చారు. ఆయన కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. వారానికి ఒకరోజు వచ్చి రిజిస్టార్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఏడీఏ కార్యాలయంను పర్యవేక్షించి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.