
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దోమ: మండల పరిధిలోని బడెంపల్లికి చెందిన సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్) ఏఎస్‌ఐ కావలి తిరుపతి(48) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన అంత్యక్రియలను గురువారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. 1997లో ఉద్యోగానికి ఎంపికై న తిరుపతి హకీంపేట సీఆర్‌పీఎఫ్‌లో తొలిసారి విధుల్లో చేరారు. అక్కడి నుంచి త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో పనిచేశారు. జమ్మూకాశ్మీర్ పనిచేస్తున్న ఆయన ఇటీవలే బదిలీపై హకీంపేటకు వచ్చారు. విధుల్లో భాగంగా వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి, ఈనెల 7న హైదరాబాద్ తిరిగొచ్చాడు. తొడ భాగంలో ఏర్పడిన గడ్డతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సోమవారం సిబ్బంది అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి చనిపోయారు. మృతుడికి భార్య కావలి సరోజ, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు రవికుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు వరుణ్ ఏంబీఏ చదువుతున్నాడు. తిరుపతి మృతి బాధాకరమని సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బి.నాయక్ అన్నారు. సిబ్బందితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్, పోలీస్ సిబ్బంది మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
అనారోగ్యంతో సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ తిరుపతి మృతి