అకౌంటెంట్‌ తప్పిదం.. జీతాలు ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

అకౌంటెంట్‌ తప్పిదం.. జీతాలు ఆలస్యం

Sep 11 2025 6:42 AM | Updated on Sep 11 2025 6:42 AM

అకౌంటెంట్‌ తప్పిదం.. జీతాలు ఆలస్యం

అకౌంటెంట్‌ తప్పిదం.. జీతాలు ఆలస్యం

మరో ఖాతాలోకి మల్లిన నిధులు

ఉద్యోగులకు తప్పని వేతన నిరీక్షణ

తాండూరు: జూనియర్‌ అకౌంటెంట్‌ అధికారి నిర్లక్ష్యం వలన 10 రోజులుగా విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధి ఓఎన్‌ఎం సిబ్బందికి జీతాలు అందలేదు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో జూనియర్‌ అకౌంటెంట్‌ అధికారి(జేఏఓ)గా జనార్దన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఏఈల వేతనాలకు ఒక చెక్‌, ఓఎన్‌ఎం ఉద్యోగులకు మరో చెక్‌, ఆర్టీజెన్‌ వారికి ఇంకో చెక్‌ రూపంలో మూడు చెక్కులను వారి వేతనాల కోసం బ్యాంకుకు పంపారు. ఏఈలు, ఆర్టీజెన్లకు వేతనాలు అందాయి. అయితే ఓఎన్‌ఎం ఉద్యోగులైన లైన్‌మెన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు, మరి కొంత మందికి అందాల్సిన వేతనాలు ఏఈల ఖాతాలలో జమయ్యాయి. దీంతో వికారాబాద్‌, పరిగి ప్రాంతాల్లోని ఓఎన్‌ఎం ఉద్యోగులకు జీతాలు అందాయని, తమకు ఎందుకు అందలేదని పలువురు ఉద్యోగులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై ఆరా తీయగా, అకౌంటెంట్‌ తప్పిదం వలనే మరో ఖాతాలోకి నిధులు వెళ్లాయని తేలింది. అయితే సదరు అకౌంటెంట్‌.. బ్యాంకు ఉద్యోగుల వలనే తప్పిదం జరిగిందని బుకాయించడం గమనార్హం. గురువారం సాయంత్రం వరకు ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

తహసీల్‌ అధికారులపై

కలెక్టర్‌కు ఫిర్యాదు

ధారూర్‌: స్థానిక తహసీల్‌ కార్యాలయంలో రైతులు, ప్రజలను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని దోర్నాల గ్రామానికి చెందిన మహిపాల్‌ బుధవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో పైసలు లేనిదే ఫైలు కదలటం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం కొర్రీలు పెడుతూ, డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రేషన్‌ కార్డుల విషయంలో దళారులు దందా చేస్తున్నారని, వారి ద్వారానే రెవెన్యూ పనులు అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇళ్ల కేటాయింపులోమాదిగలకు అన్యాయం

ధారూరు: మండల పరిధిలోని కేరెల్లికి చెందిన మాదిగలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అన్యాయం జరిగిందని పి.రాజు బుధవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన అనర్హులైన చాలా మందికి ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. గ్రామంలో మాదిగలకు కేవలం రెండు ఇళ్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఇప్పటికైనా అర్హులైన దళితులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

దంచి కొట్టిన వాన

మత్తడి పోసిన చెరువులు

బషీరాబాద్‌: మండలంలో బుధవారం 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో చెరువులు మత్తడి పోశాయి. మండలంలోని నవల్గా ఊర చెరువు అలుగ పారడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ.. అదుపుతప్పి కింద పడ్డాడు. తోటి ప్రయాణికులు అతడిని, బైక్‌ను ఒడ్డుకు చేర్చారు. మండల కేంద్రంలోని పంచాయతీ ఎదుట రోడ్డు విస్తరణ పనుల కోసం తీసిన గుంతలో నీరు చేరాయి. ఇది గమనించని ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పత్తి చేలల్లో వరద నీరు నలిచింది.

నేటి నుంచి మండల యూనిట్‌ ఎన్నికలు

అనంతగిరి: తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి ఆయా మండలాల యూనిట్‌ ఎన్నికలు నిర్వహించనున్నామని ఆ సంఘం జిల్లా ప్రధా కార్యదర్శినర్సింహ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 11న తాండూరు, పరిగి, 13న వికారాబాద్‌, కొడంగల్‌, 17న మోమిన్‌పేట, బిషీరాబాద్‌, 19న యాలాల, మర్పల్లి, 21న కుల్కచర్లలో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

ఇబ్రహీంపట్నం: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎలిమినేడు గ్రామ పరిధిలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు డాడులు చేశారు. జూదరులను పట్టుకొన్నారు. నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement