
సోషల్ మీడియా ఉచ్చులో యువత
● దురలవాట్లకు లోనవుతున్న వైనం
● బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు
● ఆందోళన కలిగిస్తున్న పోక్సో కేసులు
● డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి
తాండూరు టౌన్: ‘సామాజిక మాధ్యమ ప్రభావంతో యువత దురలవాట్లకు లోనవుతోంది. బాలికలపై లైంగిక దాడులు పెరిగాయి. పోక్సోచట్టం కేసులు పెరుగుతున్నాయి. వారి జీవితం అంధకారం అవుతోంది. ఆ కేసుల నివారణకు కలిసి కట్టుగా కృషి చేద్దాం. వారి భవితకు బంగారు బాటలు వేద్దాం’ అని డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో మండల విద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పెడధోరణి, బాలికల అదృశ్యం, పోక్సో కేసుల గురించి చర్చించారు.
నైతిక విలువలు నేర్పించాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నడవడికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని డీఎస్పీ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలబాలికలు విద్యా సంస్థల్లోనే ఎక్కువగా ఉంటారని, వారికి విద్యా బుద్ధులతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఇతరులతో నడుచుకునే విధానం తదితర అంశాలను నేర్పించాలని సూచించారు. ఎవరైనా బాలికలు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిస్తే.. వారికి అండగా నిలిచి పోలీసుల సహాయంలో ఆకతాయిల ఆటకట్టించాలని చెప్పారు. పోక్సో చట్టం, దాని తీవ్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.