
ఎవర్నీ వదలం.. అందరిపై కేసులు
● కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్
● చంద్రవంచ దాడి ఘటనపై అధికారులు
సీరియస్‌గా ఉన్నారని వెల్లడి
తాండూరు రూరల్: ఘర్షణకు కారకులైన వారిలో ఎవరినీ వదలమని, అందరిపై కేసులు నమోదు చేస్తామని కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. మండల పరిధి చంద్రవంచ గ్రామంలో వినాయక నిమజ్జనంలో చోటు చేసుకున్న గొడవ తీవ్రస్థాయికి చేరుకుందన్నారు. సోమవారం అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, కర్రలతో దాడులు చేసుకున్నారని, ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ బస్వరాజ్‌పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దాడుల నేపథ్యంలో ఓ వర్గం నుంచి 27 మంది, మరో వర్గం నుంచి 18 మందిని ఠాణాకు పిలిపించి విచారణ చేపడుతున్నామని వివరించారు. దాడిలో గాయపడిని కానిస్టేబుల్ కోలుకున్నారని, ఆయనపై దాడి చేసిన వారిపై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదే విషయమై డీఎస్పీ, ఎస్పీ సీరియస్‌గా ఉన్నారని, కానిస్టేబుల్ వద్ద ఉన్న వీడియో ఆధారంగా మరింత మందిపై కేసులు నమోదు చేయనున్నామని, అవి మూడు సెక్షన్ల కింద ఉంటాయని వివరించారు. పరస్పర దాడుల గురించి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇరు వర్గాల దాడి ఘటనలో.. ఓ వర్గంపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కానిస్టేబుల్‌పై దాడి.. రాజీకష్టం
చంద్రవంచలో సోమవారం రాత్రి జరిగిన గొడవ విషయమై కేసులు కాకుండా, రాజీ కుదుర్చుకునేందుకు పలువురు అధికార పార్టీ నాయకుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇరు వర్గాల వారు రాజీ పడినా.. కానిస్టేబుల్‌పై దాడిమాత్రం రాజీ చేయడం కష్టమని ఆ నాయకుడు వారికి తేల్చి చెప్పినట్లు సమాచారం.