
వంతెనపై నుంచి పడి కూలీ మృతి
తాండూరు రూరల్: రైల్వే విభాగంలో అడ్డాకూలీగా పని చేస్తున్న ఓ వ్యక్తి వంతెనపై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి నారాయణపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల సురేష్(30), కొంత కాలంగా ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం అతనితో పాటు నారాయణపూర్‌కు చెందిన అంజీలు వాగుపై ఉన్న వంతెన పక్కన ఇనుప నిచ్చెనకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిచ్చెన కింద పడింది. ఈ ఘటనలో సురేష్ తల.. బ్రిడ్జికింద పిల్లర్ల పక్కన ఉన్న రాళ్లలో ఇరుక్కొని ఊపరి ఆడక మృత్యువాత పడ్డాడు. మరో కూలి వాగులో పడి, స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సురేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారని, ప్రస్తుతం సురేష్ ఒక్కడే ఉంటున్నారని కొండాపూర్ గ్రామస్తులు తెలిపారు.