
రోడ్డెక్కిన రైతన్న
వ్యవసాయానికి అర్ధరాత్రి విద్యుత్ సరఫరాపై ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు జాతీయ రహదారిపైభారీగా నిలిచిన వాహనాలు
పరిగి: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. మంగళవారం మండలంలోని రంగాపూర్ గేట్ వద్ద, సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. గంటపాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సాగుకు అర్ధరాత్రి కరెంటు సరఫరా చేస్తుండలంతో పంటలకు నీరు ఎలా పెట్టాలని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు విడతల వారీగా సరఫరా చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటును నమ్ముకొనే ఎక్కువ పంటలు వేశామని కోత లు విధిస్తుండటంతో నష్టపోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేదని.. కాంగ్రెస్ వచ్చాక సక్రమంగా రావడం లేదని పలువురు ఆరోపించారు. సీఎం జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాల్లో ఎంత ఘో రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధి కారులు వచ్చి మా సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పరిగి ఎస్‌ఐ మోహనకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. విద్యుత్ సమస్యను అధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు. దీంతో రైతులు సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.