
కళ్లకు గంతలతో గణిత అవధానం
ధారూరు: మండలంలోని నాగసమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అనంతప్పయాదవ్ కళ్లకు గంతలు కట్టుకొని గణిత అవధానం నిర్వహించారు. శతావధానంలో భాగంగా ఒకటి నుంచి 100 వరకు నంబర్లను విద్యార్థులు బోర్డుపై రాసిన వాటిని ఆయన కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా ఆరోహణ, అవరోహన క్రమంలో వివరించారు. మాయ కూడిక, మాయ చదరం, తేదీ చెబితే వారం చెప్పడం తదితర అంశాలను ఆయన విద్యార్థులకు నేర్పించారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుకోవడానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రమేశ్, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.