
నయా చోరులు!
ఫోన్ పే, గూగుల్ పే స్కాన్ చేసి సరుకుల కొనుగోలు
దుద్యాల్: శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా కొద్దీ కేటుగాళ్లు నేరాలు చేయడానికి నూతన సాధనాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తున్న తరుణంలో సైబర్ నేరస్తులు వినూత్న రీతిలో మోసాలకు తెగబడుతున్నారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి మృదువుగా మాట్లాడి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని అందిన కాడికి లూటీ చేస్తున్న ఘటనలున్నాయి. లేదంటే మీకు లాటరీ వచ్చిందని చెప్పి వివరాలు ఆరా తీసి బెదిరింపులకు పాల్పడుతున్న పోకడలు చూస్తున్నాం. ఇవే కాకుండా సైబర్ నేరస్తులు డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్, మొబైల్ హ్యాక్, వివిధ రూపాల్లో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దుద్యాల్ మండలంలో కొత్తరకం సైబర్ మోసం చోటు చేసుకుంది. కిరాణ దుకాణాలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం వేళలో కిరాణం, ఇతర వ్యాపారం చేసుకునే వారి దగ్గరకు వచ్చి కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన మొత్తం బిల్లును ఆన్‌లైన్ రూపంలో చెల్లించారు. అప్పటికప్పుడు నగదు ఖాతాలో జమ అయినట్లు చూపగా.. అనంతరం ఎక్స్‌ప్రైడ్, డికై ్లన్ అని వచ్చి అమౌంట్ మాయమవుతున్న ఉదంతం చోటు చేసుకుంది. హస్నాబాద్ గ్రామానికి చెందిన కిరాణ దుకాణం నిర్వాహకుడు కొడంగంటి వెంకటేశ్, కొడంగల్ మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామానికి చెందిన కిరాణ వ్యాపారి శివ కుమార్‌లకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి.
రెండు ఘటనలు
ఒకరోజు గడిచాక ఖాతాలో నగదు చెక్ చేయగా బాధితులు కంగుతిన్నారు. కేవలం మెసేజ్ రూపంలో డబ్బులు జమ అయినట్లు చూపించి, అనంతరం దుండగులు మోసానికి పాల్పడ్డారు. దీంతో వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాపారి వెంకటేశ్ వద్ద రూ.1,200ల సరుకులు గత నెల 30న, శివకుమార్ వద్ద 15 రోజుల క్రితం రూ.1,680ల సరుకులు కొనుగోలు చేసి నగదు ఆన్‌లైన్ చేసినట్లు చూయించారు. అనంతరం ఖాతాలో నగదు జమకాకుండా మాయం చేశారని బాధితులు వాపోతున్నారు.
నగదు ఖాతాలో జమ కావడం లేదని వ్యాపారుల గగ్గోలు
దుద్యాల్‌లో వెలుగు చూసిన కొత్తరకం సైబర్ మోసం
డిజిటల్ పేమెంట్స్‌పై జాగ్రత్తగా
ఉండాలని పోలీసుల సూచన
అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుంచి ఫోన్, వీడియో కాల్స్ వస్తే స్పందించొద్దు. వ్యాపారస్తులు కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కొంత మంది న్యూడ్ వీడియోకాల్స్ చేసి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిని వెంటనే తిరస్కరించాలి.
– శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి

నయా చోరులు!

నయా చోరులు!