
చంద్రవంచలో ఉద్రిక్తత!
తాండూరు రూరల్: వినాయక నిమజ్జన వేడుకలో మొదలైన చిన్న గొడవ చినికిచినికి గాలి వానలా మారింది. ఈ సంఘటన మండలంలోని చంద్రవంచలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈశ్వరుడి దేవాలయం వద్ద ఇరువర్గాలకు చెందిన విగ్రహాలు ఎదురుపడ్డాయి. ట్రాక్టర్‌ను పక్కకు తీస్తే ముందుకు వెళ్తామని ఓ వర్గం యువకులు కోరారు. ఈ విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. మరుసటిరోజు ఆదివారం పెద్ద మనుషులు సమక్షంలో పంచాయితీ పెట్టి సముదాయించారు. అంత సద్దుమణిగిందనుకున్న క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు చెందిన యువకులు ఇళ్లల్లోకి వెళ్లి మరీ దాడులు చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలకు చెందిన కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 100కు కాల్ చేయడంతో గ్రామానికి కానిస్టేబుల్ బస్వరాజ్, శేఖర్‌లు వెళ్లారు. గొడవ ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ బస్వరాజ్ తలకు బలమైన గాయమైంది. దీంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిలో గాయపడిన వారికి సైతం వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నగేశ్, ఎస్‌ఐ రాథోడ్ వినోద్ మంగళవారం చంద్రవంచ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం సాయంత్రం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సైతం గ్రామంలో పర్యటించి దాడి గల కారణాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ గాయపడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినాయక నిమజ్జన వేడుకలో
మొదలైన గొడవ
అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి
ఇరువర్గాల దాడులు
ఆపేందుకు వెళ్లిన
కానిస్టేబుల్ తలకు గాయం
కేసులు నమోదు చేశాం
గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఇరువర్గాల ఘర్షణపై 15 నుంచి 20 మందిపై కేసులు నమోదు చేశాం. గొడవ జరిగిన సందర్భంలో కానిస్టేబుల్ తీసిన వీడియో ఆధారంగా మరికొంత మందిని గుర్తిస్తున్నాం. కొందరు గ్రామం వదిలి పారిపోయారు. వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎంతటి వారైనా శిక్షార్హులు.
– నగేశ్, తాండూరు రూరల్ సీఐ

చంద్రవంచలో ఉద్రిక్తత!

చంద్రవంచలో ఉద్రిక్తత!