
వర్క్ షాప్‌లో ఉత్తమ ప్రతిభ
మోమిన్‌పేట: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాపులో తెలంగాణ బృందం ఉత్తమ ప్రతిభ చాటిందని ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయుడు దండు రమేశ్ అన్నారు. విద్యలో తోలుబోమ్మలాట పాత్ర అనే అంశంపై పదిహేను రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించారన్నారు. 13రాష్ట్రాలకు చెందిన 90మంది ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములయ్యారని వివరించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఖనిజ సంపద, సహజ సౌందర్యం తదితర అంశాలను నృత్య సంగీతం ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. ప్రాథమిక తరగతి బోధనలో పప్పెట్రీ ద్వారా జాయ్‌ఫుల్ లెర్నింగ్ జరిగేలా ఉపాధ్యాయులను సంసిద్ధం చేయడం, జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించామని వివరించారు. మంగళవారం నిర్వహించిన కథ, కళలు, బుర్రకథ, హరికథలు, లంబాడీ నృత్యాలకు అందరి నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు.