
తీరని వ్యథ..!
ఉదయం 6 గంటలకే ఎల్మకన్నె పీఏసీఎస్‌కు.. భారీగా తరలివచ్చిన అన్నదాతలు గంటల తరబడి నిరీక్షణ ఒక్కొక్కరికి ఒకే బస్తా ఆందోళన వద్దంటున్న వ్యవసాయశాఖ
యూరియా కోసం రైతన్నల పాట్లు
తాండూరు రూరల్/పరిగి: యూరియా సమస్య ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా భారీ క్యూలే దర్శనమిస్తున్నాయి.. తాండూరు మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం పంటలకు యూరియా వేయాల్సి ఉండటంతో రైతులు ఫెర్టిలైజర్ దుకాణాలకు, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. తెల్లవారుజామునే వెళ్తున్నా బస్తా కూడా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మండలంలోని ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయానికి సోమవారం ఉదయం 6 గంటలకే రైతులు భారీగా చేరుకున్నారు. దాదాపు 300 మంది రావడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. నాలుగు గంటల పాటు నిరీక్షించిన రైతులకు ఒక బస్తా యూరియా టోకెన్ రాసిఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని ఒక్కొక్కరిని గేటు లోపలికి పంపారు. ఒక్కరికి ఒకే బస్తా ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నుంచి 5 బస్తాల అవసరం ఉందని స్పష్టం చేశారు. పలువురు ఏడీఏ కార్యాలయానికి వెళ్లి అధికారి కొమురయ్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 230 బస్తాల యూరియా అందుబాటులో ఉందని క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. మంగళవారం మరో 30 టన్నులు వస్తుందని ఎవరూ ఆందోళన చెందరాదని సూచించారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పెద్దేముల్‌లో ఆందోళన
యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతుసేవా సహకార సంఘానికి యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అన్నదాతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొ బస్తా పంపిణీ చేశారు. చాలా మందికి యూరియా దొరకలేదు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా బాధలు పట్టవా?
యూరియా కోసం నియోజకవర్గ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం ఒక్క బస్తాకు మించి దొరకడం లేదు. సోమవారం పరిగి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదునుకు మందులు వేయక పోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు అధికారులు, ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వెంటనే సాగుకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఒకే బస్తా ఇచ్చారు
ఉదయం 6 గంటలకే ఎల్మకన్నె పీఏసీఎస్‌కు చేరుకున్నా. నాలుగు బస్తాల యూరియా అవసరం ఉండగా ఒకే బస్తా ఇచ్చారు. అధికారులు స్పందించి సాగుకు సరిపడా యూరియా పంపిణీ చేయాలి.
– నేరేటి రవి, రైతు, బెల్కటూర్ గ్రామం