
వికాకాబాద్ మండలం గెరిగెట్ పల్లి నిండుగా వ్యవసాయ బావి
రికార్డు స్థాయిలోభూగర్భ జలాలు
అధిక వర్షపాతమే కారణం
నిండిన చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు
అత్యల్పం.. అత్యధికం కొడంగల్ నియోజకవర్గంలోనే..
వికారాబాద్: మునుపెన్నడూ లేని విధంగా ఏడాది వరుసబెట్టి కురిసిన వర్షాలకు పాతాళ గంగమ్మ పైపైకి వచ్చింది. అధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అత్యధిక వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వ్యవసాయ బోరుబావుల అవసరం లేకుండానే కాలువలు, నాలాల ద్వారా పంటచేలు తడుస్తున్నాయి. జిల్లాలో 20 మండలాలు ఉండగా ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 15 మండలాల్లో అధిక వర్షపాతం పడింది.
గ్రౌండ్ వాటర్ పరిస్థితి
జిల్లాలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో సగటున 8 మీటర్ల లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్ ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు 6.78 మీటర్లకు (1.22 మీటర్లపైకి) చేరింది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో రెండు, మూడు మీటర్ల ఎత్తు వరకు వాటర్ లెవెల్ చేరుకుంది. కొడంగల్‌లో 2.32 మీటర్ల అత్యల్ప ఎత్తులో నీరు ఉండగా ఇదే నియోజకవర్గం పరిధిలోని దుద్యాల్ మండలంలో సగటున 18.87 మీటర్ల లోతులో నీరుండటం గమనార్హం.
సాధారణ వర్షపాతానికి మించి..
ప్రస్తుత సీజన్‌లో కురిసన అధిక వర్షాలే భూగర్భ జలాలు పెరగడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితమే చెరువులన్నీ పొంగిపొర్లాయి. జూన్ మొదటి వారం నుంచి సాధారణ వర్షపాతం 485 మిల్లీమీటర్లు నమోదు కాగా ఇప్పటి వరకు 648 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు ఉండగా అన్నీ నిండాయి. 800 చెరువులు అలుగు పారుతున్నాయి. చాలా చోట్ల ఫీడర్ చానల్స్ సరిగ్గాలేకపోవడం, ఆక్రమణలకు గురికావడంతో కొన్ని చెరువులు అలుగు పారడంలేదు. ప్రధాన ప్రాజెక్టులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి, శివసాగర్, కాకరవాగు నిండుకుండలా మారాయి.
గణనీయంగా పెరిగాయి
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రెండేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. వర్షపు నీరు వృథాగా దిగువకు పోకుండా కాపాడుకోవాలి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం అందిరిపై ఉంది.
– రవిశంకర్, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ