
పెన్షన్ పెంచే వరకు వదలం
అనంతగిరి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే పెన్షన్లను పెంచాలని లేకుంటే వెంట పడుతూనే ఉంటామని ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద్, మల్లికార్జున్ అన్నారు. సోమవారం పింఛను మొత్తం పెంచాలని కోరుతూ వికారాబాద్‌లోని కలెక్టరేట్ ఎదుట వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు, ఆసరా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండెళ్లు కావస్తున్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రతిరోజూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా పెన్షన్‌ను మాత్రం పెంచడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, చేయూత పెన్షన్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మంజులారెడ్డి, ఎమ్మార్పిఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రామకృష్ణ, ఎంఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాసు, నాయకులు సుభాష్, ప్రకాష్, నరసింహ, డప్పు మహేందర్, శివాజీ, రవీందర్, పుష్పరాణి, సునీత పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.