
లంబాడాలపై అసత్య ప్రచారం
మోమిన్‌పేట: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావులను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారా, లంబాడీలు సింధు నాగరికత కాలం నుంచి గిరిజనులుగా గుర్తింపు పొందారన్నారు. బ్రిటిష్ పాలకులు సైతం 1871లోనే క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారని చెప్పారు. కుట్రపూరితంగా లంబాడీలను గిరిజన జాబితా నుంచి తొలగించాలని రిట్ పిటిషన్ దాఖలు చేఽశారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోర్‌సేన జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌నాయక్, నాయకులు రవీందర్, కాశిరాం, దీప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్