
ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఆందోళన
● పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
● విద్యుత్ కార్యాలయ గేటుకు ట్రాక్టర్ అడ్డం పెట్టి రైతుల నిరసన
తాండూరు టౌన్: పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని ఇద్దరు రైతులు తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పది రోజుల క్రితం పాడైపోయింది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలని పలుమార్లు విద్యుత్ ఏఈ, లైన్‌మెన్‌ను ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. సోమవారం పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్రాక్టర్‌లో వేసుకుని తాండూరులోని విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరసనకు దిగారు. చివరికి అధికారులు ఈరోజు కుదరదు, మరో రోజు రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులిద్దరూ ట్రాక్టర్‌ను కార్యాలయ గేటుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. పది రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో పంట చేను ఎండి పోతోందని, విద్యుత్ అధికారులను బతిమిలాడినా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. రైతులకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది నచ్చజెప్పి, ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.